అమ్మ అంటే!
- Bonafide Voices
- Feb 23, 2024
- 1 min read
గొడుగు యాదగిరి రావు 9490098660
కష్టం కలిగితే
అమ్మా! అంటాడు మనిషి!
బిడ్డ కష్ట పడితే
తల్లడిల్లుతుంది తల్లి మనసు!
అమ్మ అవనిలో
నడయాడే దైవం
కాదనువాడు ఇలలో
ఏనాటికి కానరాడు!!
నవమాసాలు మేూసి
పేగుతెంచి,భూమిపై నిలిపి
పాలిచ్చి,నడక నేర్పి
క్షణ ,క్షణం,కనుసన్నలలో
విద్యాబుద్ధులు నేరిపి
అణువణువున నేనున్నానని
ఆత్మీయతతో హక్కున
నిలిపిన అమ్మకు వందనం!!
తొట్టిల్లప్పుడు, బోర్లాపడేందుకు
తొందర పడితే, ఒడిసిపట్టి
సాయం చేసి,పాపడు గెలిచిండని
సంబరపడిన అమ్మా!నీకు వందనం!!
పాకుతూ,దొగ్గాడుతూ
నడవాలని, పైకి లేచి
కింద పడుతుంటే
చేతి వేలును వొడిసిపట్టి
తప్పటడుగును సైతం
మేలు నడతలుగా కీర్తించిన
అమ్మా!నీకు వందనం!!
బడికి పోనంటూ
మారాం చేస్తుంటే
చంకనెత్తుకొని, మిఠాయి చేతికిచ్చి
బుజ్జగించి, బ్రతిమలాడి
పంతులు గారికి అప్పచెప్పి
ఏడుస్‌తున్నాడేమేూనని
కిటికీ నుండి తొంగి చూసి
తోటి వారితో కూడి ,చదువుతుంటే
చెమ్మగిల్లిన కళ్ళతో
చల్లగా వుండాలని,దీవించిన
అమ్మా!నీ ఆర్తికి వందనం!!
పై చదువులు చదివి
విదేశాలలో కొలువును చేరి
నచ్చిన పిల్లతో పెళ్ళాడి
అందనంత దూరాన
స్వంత స్వర్గంలో ఆనందించుతుంటే
వయసు తెచ్చిన వెతలతో
దిన,దినం,ఆయుష్ క్షీణించినా
తోడుండాలిసిన తరుణంలో
కొడుకు దరి లేకున్నా !
మనది కాని దేశంలో
ఏ బాధలు పడుతున్నాడోనని
ఏనాడన్నా!దరికి వస్తే ,
వాడికి లోటు ఉండకూడదని!
తినీ, తినక ,వున్నదంతా పోగుచేసి
బిడ్డ కోసమే! జీవితమంటూ
ఎదురుచూపు చూపులతో
జీవితం నడుపుతున్న!
అమ్మా! నీ కరుణకు జోహర్‌లు!!
భూదేవికి మించిన సహనం
నీ కరుణ,ఆదరణ
చిరకాలం నిలుస్తాయి
కనిపించే దైవంగా
కలకాలం నిలుస్తావు అమ్మా!!