ఆధునిక బానిసత్వం: మహిళలు
- Bonafide Voices
- 1 day ago
- 10 min read
ప్రొ|| కె. పద్మ
రచయిత రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్
సమాజ పరిణామక్రమంలో బానిస సమాజం ఒక దశ. ఆఫ్రికా, ఆసియా దేశాల లోని యువతి, యువకులను, ముఖ్యంగా యువకులను దొంగలించి ఓడలలో అత్యంత అమానవీయ పరిస్థితులలో యూరోప్, బ్రిటన్, అమెరికా దేశాలలో వాణిజ్య పంటలు, తేయాకు, చెరకు కాఫీ తోటలలో, గనులలో, పరిశ్రమలలో పనిచేసేందుకు తీసుకునివెళ్ళే వారు. ద ట్రాన్స్ అట్లాంటిక్ డాటా బేస్ ప్రకారం 1526 నుంచి 1875 వరకు 5,01,942ల మంది ఆఫ్రికన్లు బానిసలుగా అమెరికాలో దిగారు. వీరిలో 74 శాతం మంది పురుషులు. బానిసత్వం ద్వారా పురుషుల శ్రమను ఉత్పత్తి కోసం ఒక సరుకుగా మార్చ బడింది. అయితే మహిళలను బానిసలుగా చేసింది బానిస పిల్లలను కనడం ద్వారా బానిస వ్యవస్థను కొనసాగించడానికి కానీ వారిని వ్యభిచారంలోకి దించడానికి కాదు. అయితే, ఆధునిక బానిసత్వంలో 71 శాతం మంది మహిళలే ఉన్నారు. మహిళలు జీవించి వున్న సరుకు, అంటే వారి శరీరం సరుకుగా పరిగణించబడుతున్నది. మహిళలను వ్యభిచార వృత్తిలోను, ఉత్పత్తిలో చవక శ్రమగాను ఉపయోగిస్తున్నారు. బానిస తిరుగుబాట్లు, హేతు వాదుల ప్రయత్నాలు, బానిస వ్యతిరేక సంస్క రణ వాదుల ఉద్యమాల ఫలితంగా బ్రిటన్లో 1833 లోనూ అమెరికాలో 1862 లోనూ బానిసత్వానికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకుని వచ్చారు. అదేవిధంగా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా బానిసత్వాన్ని నిరోధించడం జరిగింది. సుమారు 200 సంవత్సరాల క్రిందట బానిసత్వాన్ని రద్దు చేశారు కానీ ఈ నాటికీ ప్రపంచవ్యాపితంగా బానిసత్వం కొనసాగుతున్నది. ప్రపంచవ్యాపితంగా బానిసత్వం చట్ట విరుద్ధం. పశ్చి మదేశాలలో పునర్జీవన ఉద్యమాలు, సంస్కరణ ఉద్యమాలు, రష్యాలో సోషలిస్ట్ విప్లవం విజయవంతం అయిన తరువాత కార్మికులను బానిసలుగా పరిగణించే ధోరణి వెనక్కి వెళ్లింది. వారికి కొన్ని హక్కులు కల్పించడం జరిగింది. కానీ రష్యాలో సోషలిజం కూలిపోవడం, అమెరికా ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడంతో పాటు అనేక దేశాలలో ఉదారవాద ఆర్థిక విధానాలను అమలు చేయమని అభివృద్ధి చెందిన దేశాలు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు ఒత్తిడి చేయడం కారణంగా ఆధునిక బానిసత్వం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బానిసత్వం ప్రపంచ మంతటా కొత్త రూపంలో వ్యాప్తి చెంది ఉంది. కానీ బయటకు కనబడదు. కార్మికులు సంకేళ్లతో కనబడరు. కానీ వారి మానసిక శారీరక శ్రమ బానిసత్వాన్ని పోలి వుంటుంది. పేదరికం, నిరుద్యోగం, నిర్బంధ శ్రమ లాంటి అవరోధాలు కానరాని సంకెళు గామారి కార్మికుల స్వేచ్ఛను హరించివేస్తాయి. అదేవిధంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు కార్మికులను గత్యంతరం లేక పనిలో కొనసాగేటట్టు చేస్తున్నాయి. ఆధునిక బానిసత్వాన్ని మనం ముఖ్యంగా ఎగుమతుల కోసం ఉత్పత్తి చేసే పరిశ్రమలలో ఎక్కువగా చూస్తాము. మన దేశంలో జౌళి పరిశ్రమ, రెడీమేడ్ దుస్తులు, డైమాండ్లు, రొయ్యలు, చేపలు, మందులు, బొమ్మలు, ఎలెక్ట్రానిక్ వస్తువులు మొదలైనవి ఎగుమతి ఆధారిత పరిశ్రమలు. ఈ పరిశ్రమలలో తయారైన వస్తువులను 100 శాతం ఎగుమతి చేస్తారు. ఈ పరిశ్రమలలో మహిళలు ఎక్కువగా పనిచేస్తారు.
ఉదారవాద ఆర్థిక విధానాలు ఎగుమతు లను ప్రోత్సహించే నెపంతో చవక శ్రమ మీద ఆధారపడుతున్నాయి. ప్రభుత్వాలు పెట్టుబడి దారులకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సా హకాలు ఇచ్చే క్రమంలో శ్రామిక చట్టాలలో మార్పులు చేస్తున్నాయి. ప్రజలందరికీ చెందే సంపదను కార్పొరేట్లకు అతి తక్కువ విలువకు అప్పజెప్పుతున్నాయి. ఈ విధానాలు ప్రజల స్వేచ్ఛను హరించివేస్తున్నాయని ప్రముఖ ఆర్ధిక వేత్త ప్రభాత్ పట్నాయక్ చెప్పారు. అందువలన కార్మికులు గతంలో పొరాడి సాధించుకున్న హక్కులు, సామాజిక వనరులపైన హక్కులు కోల్పోతున్నారు. వారి జీవనభృతి సవాలుగా
మారుతున్నది. వేతనాలు పెరగకపోవడం, ధరలు పెరగడం, నిరుద్యోగం పెరగడం, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, విద్య, వైద్యం అంగడిలో సరుకుగా మారడం వలన సామాన్య ప్రజలకు తమ కనీస అవసరాలను తీర్చు కోవడం కష్టమవుతున్నది. ఈ బాధల నుండే మతతత్వ ఫాసిస్ట్ శక్తులు తలెత్తాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త ఉత్సాపట్నాయక్ చెప్పారు. మహిళలు ఈ శక్తుల ఉచ్చులో చిక్కుకుంటు న్నారు. మతం, కులం నిర్దేశించిన ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో అణచివేతకు గురి అవుతున్నారు. ప్రజలు పేదరికం, సంక్షేమ పథకాల కుదింపు, అభద్రత, నిరుద్యోగం, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తున్నది. ఇటువంటి పరిస్థితులలో కార్మికులు, ఏ కొమ్మ దొరికితే దానిని పట్టుకుని వరద దాటినట్టు, ఏ ఆసరా దొరికితే దాని ఆధారంతో బతుకు బండిని లాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు మోసాలకు, దోపిడీకి, హింసకు, లైంగిక వేధింపులకు, అక్రమ రవాణాకు, అత్యంత హీన పరిస్థితులలో పని చేయడానికి సిద్ధపడుతున్నారు. అలాగే మహిళ లను, పిల్లలను అమ్మివేయడం జరుగుతోంది. మహిళలు పేదరికం, అభద్రత నుంచి తమ జీవితాలను మెరుగు పరుచుకోవడానికి, తమ కుటుంబాలకు సహకరించడానికి చేసే ప్రయత్నంలో ఈ ఉచ్చులో చిక్కు కుంటున్నారు. నిరక్షరాస్యత, అజ్ఞానం వలన మహిళలు పురుషులతో పోల్చినప్పుడు ఎక్కువగా మోస పోతున్నారు, వేధింపులకు గురవుతున్నారు. ఒకసారి ఆ ఉచ్చులో చిక్కుకున్న వారు బయటి రావడం చాలా కష్టం. పైకి పనికి వెళ్ళి వచ్చి నట్టు కనబడుతుంది కానీ వారు అనుభవించే
వేధింపులు, హింస కనబడదు.
*ఆధునిక బానిసత్వం
మహిళల నిర్బంధ శ్రమ, అప్పు వెట్టి/వెట్టి చాకిరీ, కుటుంబపరమైన బానిసత్వం, మానవ అక్రమ రవాణా, నిర్బంధ వివాహం, చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేయడం, గృహ
బానిసత్వం, సరఫరా గొలుసులో బానిస త్వం...ఇవన్నీ ఆధునిక బానిసత్వం కిందకు వస్తాయి. ఐక్య రాజ్య సమితి అంచనాల ప్రకారం 2021లో 5 కోట్లమంది మహిళలు ఆధునిక బానిసత్వంలో జీవిస్తున్నారు. అందులో 2.8 కోట్ల మంది, అంటే 56 శాతం మంది నిర్బంధ శ్రమ చేస్తుండగా మరో 2.2 కోట్ల మంది, అంటే 44 శాతం మంది బలవంతపు వివాహహం చేసుకున్నారు. ప్రపంచ నలుమూలల ఈ పరిస్థితి ఉన్నప్పటికీ బయటకు కానరాదు. వాక్ ఫ్రీ ఫౌండేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ వలస సంస్థ సహకారంతో నిర్వహించిన అధ్యయనం ఆధునిక బానిసత్వా నికి సంబం ధించి ఖచ్చితమైన అంచనాలను అందచేసింది. 2014లో, ప్రపంచ బానిసత్వ సూచిక అంచనా ప్రకారం ప్రపంచంలో 3.58 కోట్ల మంది ఆధునిక బానిసత్వంలో ఉండగా ఈ సంఖ్య 2016లో 4.03 కు పెరిగింది. 2016, 2021 మధ్య కాలం లో అదనంగా 1 కోటి మంది మహిళలు ఆధునిక బానిసత్వంలోకి నెట్టివేయబడ్డారు. జాతి, సంస్కృతి, మతం అనే బేధం లేకుండా ప్రపంచ వ్యా ప్తంగా అన్ని దేశాలలోను మహిళల ఆధునిక బానిసత్వం కనబడుతుంది. నిర్బంధ శ్రామికులలో సగం కంటే ఎక్కువ మంది, బలవంతపు వివాహాలు చేసుకున్నవారే. వారిలో నాలుగోవంతు మంది మధ్యస్థ ఆదాయ దేశాలు, అధిక ఆదాయ దేశాలలో కనబడతారు. మహిళలు, పిల్లలు అనమానలతో ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. ప్రైవేట్ రంగంలో పనిచేసే నిర్బంధ మహిళా శ్రామికులలో 23 శాతం మంది బలవంతపు వాణిజ్య లైంగిక దోపిడిని అనుభవిస్తున్నారు. ప్రభుత్వ రంగంలోని ఎనిమిది మందికార్మికులలో కనీసం ఒకరు బాలకార్మి కుడు లేదా బాలకార్మికురాలు. ఇది నిర్బంధపు వాణిజ్య లైంగిక దోపిడిలో సగం కంటే ఎక్కువ అని 2022 ఐక్యరాజ్య సమితి నివేదిక తెలుపింది. ఆసియా- పసిఫిక్, ఆఫ్రికా దేశాలలో 85 శాతం ఆధునిక బానిసత్వం ఉంది. అమెరికా, సెంట్రల్ ఐరోపా దేశాలలో ఇది 14 శాతంగా ఉంది. అరబ్ దేశాలకు సంబంధించి సమాచారం లేదని అంతర్జాతీయ శ్రామిక సంస్థ నివేదిక తెలియచేసింది. ఆధునిక బానిసత్వపు రెండు ప్రధాన అంశాలు
నిర్బంధ శ్రమ, నిర్బంధ వివాహలు. ఈ రెండు అంశాల నిష్పత్తి 62: 38గా ఉంది. ఐక్య రాజ్య సమితి 2022 నివేదిక ప్రకారం ప్రైవేట్ రంగంలో 86 శాతం నిర్బంధ శ్రమ ఉంటే ప్రభుత్వ రంగంలో 14 శాతం వరకు ఉంది. నిర్బంధ వివాహలలో ఆసియా- పసిఫిక్, ఆఫ్రికాల వాటా 38, 35 శాతాలాగా ఉన్నాయి. ఇతర దేశాల వాటా 3 శాతం. అదేవిధంగా నిర్బంధ శ్రమలో కూడా ఆసియా-పసిఫిక్, ఆఫ్రికా దేశాల వాటా 38,50 శాతం చెందగా మిగిలిన దేశాలకు 12 శాతం వాటా చెందుతుంది.
భారత దేశం జనాభా వరంగా ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది. ప్రపంచంలోనే ఆధునిక బానిసత్వంలో ఉన్న అత్యధిక మంది ఇండియాలో ఉన్నారు. 2021లో దేశంలో 1.1 కోట్ల ప్రజలు ఆధునిక బానిసత్వంలో జీవిస్తున్నారు. ఇది ఏ దేశంతో పోల్చినా చాలా ఎక్కువ. ప్రతి 1000 మంది ప్రజలకు 8 మంది ఆధునిక బానిసత్వంలో జీవిస్తున్నారు. ఈ విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ 6వ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యా ప్తంగా 160 దేశాలకు గాను భారత దేశం 34వ స్థానంలో ఉంది.
*వైవాహిక బానిసత్వం
ఆఫ్రికా దేశంలో బలవంతపు పెళ్లిళ్లు ప్రతి 1000కి 4.8 జరుగుతుండగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 1000 కి 2 జరుగుతున్నాయి. బలవంతపు పెంళ్లిల్లు, బాల్య వివాహాలు జరగడానికి పేదరికం, అవకాశాలు లేకపోవడం, యుద్ధాలు, లింగ అసమానతలను బలపరిచే మత ఆధారిత సంప్రదాయాలు, సంస్కృతి కారణాలు. పెళ్లికాని ఆడపిల్లలు అత్యాచారానికి, లైంగిక హింసకు గురయ్యే ప్రమాదం ఉన్నప్పుడు పెళ్లి ఒక సురక్షిత కవచంగా ఉంటుంది. పెళ్లి ఆడపిల్లలకు భద్రతను, భవిష్యత్తుని, కుటుంబం గౌరవాన్ని కాపాడుతుంది. కొన్ని సందర్భాలలో బలవంతంగా పెళ్లికి ఒప్పించడానికి అత్యాచారాన్ని ఆయుధంగా పయోగిస్తున్నారు. ఆఫ్రికాలో బలవంతపు పెళ్లిల్లను బానిసత్వంలోకి దించడానికి ఒక సాధనంగా
వాడుతున్నారు. బలవంతపు పెళ్లికి ఆసియాలో కొన్ని సందర్భాలలో తల్లి తండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు చేసే లింగ ఆధారిత హింస కారణం. చిన్న లేదా పెద్ద పిల్లల అంగీకారాన్ని బలవంతంగా పొందడానికి భయపెట్టడం లేదా భౌతిక హింసని ఉపయోగించి బలవంతపు పెళ్లి అనే వుచ్చులో బంధిస్తున్నారు. బలవంతంగా పెళ్లిని కుదర్చడానికి అనేక కారణాలున్నాయి. బలవంతపు పెళ్లిని సమర్ధించడానికి తల్లి తండ్రులు చెప్పే ప్రధానకారణాలు మత సంప్రదాయాలు, సంస్కృతి, బాధ్యత, గౌరవం. ఇవి వారి ఆడపిల్లల లైంగికతను నియంత్రిస్తు న్నాయి. నిర్బంధపు పెళ్లిళ్ళకు, బాల్య వివాహాలు, మహిళల లైంగికత, వ్య క్తిగత నమ్మకాలకు సమాంతర సంబంధం ఉంది. అనేక మంది తల్లి తండ్రులు ఆడపిల్లలను అమ్మేయడానికి పేదరికం కూడా ఒక కారణం. ఆడపిల్లలను ధనవంతులకు అమ్మడం ద్వారా వారు ఆదాయాన్ని పొందుతారు. ఆర్ధిక ఇబ్బందులు కూడా ఆడపిల్లలను బానిసత్వంలోకి దించడానికి ఒక కారణం.
ఒక యువతికి పెళ్లిని నిరాకరించే హక్కు లేనప్పుడు ఆ పెళ్లి 'బానిస వివాహం' గా పరిగణించ బడుతుంది. ఐక్య రాజ్య సమితి కన్వంషన్స్ బలవంతవు వివాహాన్ని బానిసత్వానికి సమానంగా పరిగణించారు. ఒక యువతిని అమ్మేయవచ్చును. యువతి భర్త చనిపోతే వేరే వ్యక్తి ఆమెను వారస త్వంగా పొందవచ్చును. యువతులను, మహిళలను ముసలి సంపన్న పురుషులను పెళ్లి చేసుకోమని బలవంతంచేయడం ద్వారా వారు లైంగిక, గృహ బానిసలు అవుతున్నారు. ఎథోయోపియాలో ఇప్పటికీ ఈ సంప్రదాయం చిన్న వయస్సు ఆడపిల్లలను రేవ్ చేయడం ద్వారా కొనసాగుతున్నది. ఇక్కడ నమోదైన మరో రకమైన బానిస వివాహం మహిళలను ప్రీస్ట్లకు తాకట్టుపెట్టడం. ఘనా, టాంగో, బెనిన్, నైజేరియలో కుటుంబ సభ్యులు తమ నేరాలకు
ప్రాయశ్చిత్తం పొందడానికి మహిళలను ప్రీస్ట్లకు తాకట్టు పెట్టుతున్నారు. ఆసియా దేశాలలో కొన్ని సందర్భాలలో యువతులను వారి అనుమతి లేకుండా వధువు ధరను చెల్లించి 'కొనుగోలు' చేయడం జరుగుతున్నది. మన దేశంలో రాజస్థాన్, హరియాన రాష్ట్రాలలో ఎక్క డైతే స్త్రీల నిష్పత్తి తక్కు వగా ఉందో అక్కడ ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను, ముఖ్యంగా ఒడిషా, బిహార్ కు చెందిన యువతులను, వరుడు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతున్నది. వైవాహిక బానిసత్వంలో ఉన్న మహిళలు రేపిస్టుల నుండి, కొనుగోలుదార్ల నుండి, ప్రీస్ట్లనుండి భౌతిక, లైంగిక హింసను ఎదుర్కుంటున్నారు.
*వ్యభిచారం
వ్యభిచారం బార్స్ లోనూ, ప్రైవేట్ స్థలాల్లోనూ అక్రమ నెట్వర్క్స్ ద్వారా జరుగు తున్నది. పేదరికం, ఉద్యోగాలు ఇస్తామనిచెప్పి మోసగించి వ్యభిచార వృత్తిలోకి దించడం, కుటుంబ సహకారం, ఆదరణ లేనిపరిస్థితులు, కుటుంబం ఆడపిల్లలను అమ్మి వేయడం వ్యభిచారానికి కారణాలు. మధ్యప్రదేశ్లోని బెడియా, బచ్చడా, ఖాంజార్ అనే దళిత కులాల వారు పుట్టిన పిల్లల్లో 13 సవత్సరాల లోపు ఆడపిల్లలను కుటుంబ పోషణకై వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. జోగిని, దేవదాసీ ఆచారాలు కూడా ఇదే కోవకు చెందుతాయి. నిమ్న కులాలకు చెందినవారు తమ ఆడపిల్లలను హిందూ దేవుళ్ళతో వివాహం జరిపిస్తారు. ఇది పురోహితులు, గుడి పోషకులకు లైంగిక దోపిడి చేయడానికి అవకాశం కల్పిస్తుంది. 1988లో ఈ ఆచా రాన్ని చట్టపరంగా నిషేధించినప్పటికీ ఇంకా కొనసాగుతున్నది. భారత దేశంలో నిర్బంధ వివాహాలకు సంబంధించి సరైన సమాచారం లేదు. 2022లో 20 నుండి 24 సవత్సరాలు ఉన్న మహిళల్లో 23 శాతం మంది 18 సవత్సరాలలోపు వివాహం చేసుకున్నారని
అంచనాలు తెలియచేస్తున్నాయి. 2021లో 182 మంది మహిళలు నిర్బంధ వివాహాల కోసం అక్రమంగా రవాణాచేయబడ్డా రని ప్రభుత్వం గుర్తించింది. దేశంలో బాల్య వివాహాలను నిషేధించినప్పటికీ బాల్యంలోనే వివాహం జరిగిన 21.6 కోట్ల మంది మహిళలు, ఆడపిల్లలు దేశంలో ఉన్నారు. ప్రపంచంలోనే భారత్లో లింగ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. 2025లో 146 దేశాల లో జెండర్ గ్యాప్ ఆధారంగా భారత దేశం 131వ స్థానంలో ఉంది. లింగ అసమానతల సూచీ ప్రకారం 2025లో ఇండియా ర్యాంక్ 193 దేశాలలో 108వ స్థానంలో ఉంది. పితృస్వామ్య ఆలోచనలు, సంప్రదాయాలు మహిళల పాత్రలను పరిమితంచేసి అభద్రతను పెంచుతున్నాయి. ఉదాహరణకి ఎక్కువ వరకట్నం ఇవ్వాల్సి వస్తుందని ఆడపిల్లలను ఎక్కువగా చదివించకుండా తొందరగా పెళ్లి చేస్తున్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కూడా ఆడపిల్లలకు తొందరగా పెళ్లిల్లు చేస్తున్నారు. నిర్బంధ వివాహం మహిళలను హింసకు గురి చేస్తుంది. సుమారు 30 శాతం మంది పెళ్లి అయిన మహిళలు వారి జీవితకాలంలో జీవిత భాగస్వామి నుండి హింసను అనుభవించారు.
*నిర్బంధ శ్రామికుల బానిసత్వం
ఎగుమతుల కోసం ఉత్పత్తి చేసే పరిశ్రమ లలో నిర్బంధ శ్రమ నియామకం ఉంది. నిర్బంధ శ్రమను ఉపయోగించడాన్ని ప్రతి దేశం సమర్ధించుకుంటున్నది. ఉదాహరణకి ఉజ్బెక్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు చెందిన బడికి వెళ్తున్న 5 నుండి 14 వయస్సులో ఉన్న పిల్లలను చేతులతో పత్తి ఏరడానికి శరదృతువులో నియమించడాన్ని కొనసాగిస్తు న్నది. ఈ సమస్య ఉన్నట్టుగా అంగీకరించ డానికి ఉజ్బెక్ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ఉజ్బెకిస్తాన్లో 14 లక్షలకంటే ఎక్కువ మంది పిల్లలు పత్తి ఏరివేసే పని చేస్తున్నట్టు అందు
బాటులో ఉన్న గణాంకాలు తెలియచేస్తున్నాయి. మీడియాపై తీవ్ర నిర్బంధం ఉన్న కారణంగా వాస్తవంగా ఎంత మంది పిల్లలు పనిచేస్తున్నారు. అన్నది తెలుసుకోవడం కష్టం. ఈ మధ్య కాలంలో పత్తి ఏరివేతలో పిల్లల నియామకం పెరిగిందని నివేదికలు తెలియ చేస్తున్నాయి. ఎగుమతుల నుంచి ఆర్జించిన మొత్తం 50 కోట్ల డాలర్లు నిర్బంధ శ్రమ నుంచి కాకపోయినప్పటికి సుమారు ఏడాదికి 10 కోట్ల డాలర్లు నిర్బంధ శ్రమ వాటాగా ఉంటుంది. నేడు ఇటుకల తయారీ, వ్యభిచారం నుండి బహులజాతి కార్పొరేషన్స్ వరకు బానిసత్వం విస్తరించి ఉంది. 'ఆధునిక బానిసత్వం' ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో సంక్లిష్ట సంబంధా లను కలిగి ఉంది. పాత బానిసత్వ పద్ధతుల మాదిరి కొత్తగా బానిసలైన ప్రజలకు దీర్ఘకాల పెట్టుబడులు అవసరం లేదు. కొత్త బానిసలు చాలా చవక, అతి తక్కువ సంరక్షణ అవసరం. ఎప్పుడంటే అప్పుడు వారిని వాడి పారవేయ వచ్చును. అంతర్సంబంధమున్న మూడు అంశాలు నూతన బానిసత్వానికి కార ణాలు. అవి: జనాభా పెరుగుదల, వ్యవసాయం ఆధునికరించబడటం, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలలో మార్పులలో భాగంగా అవినీతి, హింస పెరగడం. పేదరికం, యుద్ధాలు, లింగ అసమానతలు, శ్రామిక వ్యయాన్ని తగ్గించమని నిరంతర ఒత్తిడి, బానిసత్వం పెరగడానికి భూమికను ఏర్పరిచాయి. ప్రైవేటు అప్పుల వలన బాండెడ్ లేబర్లో సగం కంటే ఎక్కువ మంది బాధితులవుతున్నారు. ప్రైవేటు నిర్బంధ శ్రమ బానిసత్వంలో పురుషులకన్నా మహిళలు ఎక్కువ బాధితులవుతున్నారు. 57.6 శాతం మహిళలు బాధితులైతే 42.4 శాతం పురుషులు బాధితులు. వ్యక్తిగత ఋణాలను ఉపయోగించు కుని నిర్బంధ శ్రామికులు వ్యవసాయం, గృహ లేదా వస్తుతయారీ పరిశ్రమలలో పనిచేసేటట్టు చూస్తున్నారు. ప్రపంచవ్యాపితంగా వెట్టి ఆకిరీ లేదా ఋణ వెట్టిని ఉపయోగించి ప్రజలను బానిసలుగా చేస్తున్నారు. దక్షిణ ఆసియాలో ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, నేపాల్ దేశాలలో వెట్టి చాకిరీ ఎక్కువగా ఉంది. 2016లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంష్టాబ్లిష్మెంట్ విజన్ డాక్యుమెంట్ ప్రకారం భారత దేశంలో 1.84 కోట్ల మంది వెట్టి కార్మికులుగా ఉన్నారు. వారిలో 80 శాతం మంది ఎస్టీ, ఎస్సీ, ఓబిసి తరగతులకు చెందినవారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎస్ఓ) నివేదిక 2017 ప్రకారం గృహ రంగంలో నిర్బంధ శ్రామికులు ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరి శాతం 24. ఆ తరువాత నిర్మాణరంగంలో 18 శాతం. తయారీ రంగంలో 15 శాతం మంది పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది అనేక రకాల బలాత్కారాలకు గురిఅవుతున్నారు. వేతనాలు నిలిపివేయడం, హింసిస్తామని బెదిరించడం, కుటుంబ సభ్యులను బెదిరించ డం ద్వారా పని ఒదిలి వెళ్లకుండా చేయడం లాంటివి కొన్ని. పద్ధతులను అమలు చేస్తున్నారు. మహిళలు తరుచూ లైంగిక హింస, లైంగిక దోపిడీకి బాధితులు. పిల్లలు వ్యభిచార బాధితులు. ఆధునిక బానిసలు పర్షియన్ గల్ఫ్ లో నిర్మాణ రంగంలో, నేపాలీ అమ్మాయిలు వ్యభిచార వృత్తిలో, ఢాయి షిప్స్ రొయ్యలు వేటాడేవారిగా, ఇండియాలో ఇటికల బట్టీలలో, బంగ్లాదేశ్ లో దుస్తుల తయారీలో పనిచేస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలలో ప్రైవేట్ ఇళ్లల్లో పనిచేసేవారు కూడా బానిసత్వానికి లోనవుతున్నారు. వెట్టి చాకిరీకి సంఘటిత రంగంలోని ఉద్యోగస్తుల మాదిరి సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత, వేతనంతో కూడిన సెలవులు, నిర్ధిష్ట వేతనం, సురక్షణమైన పని పరిస్థితులు, ఆరోగ్య సదుపాయాలు ఉండవు. కనుక వీరు తరుచూ సులభంగా దోపిడీకి లోనవుతారు. అసంఘటిత రంగం, పేదరికం వెట్టి చాకిరీ కొనసాగడానికి ఉపకరిస్తున్నాయి. పెద్ద కార్పొరేషన్స్లో కార్మికు లను ఏజన్సీల ద్వారా నియమించు కోవడం వలన కార్మికులకు, కార్పొరేషన్లకు ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఆ కారణంగా కార్మికులు దోపిడీకి గురౌవుతున్నారు. ఏజన్సీలు లాభాలు గణిస్తున్నాయి.
భారత దేశంలో 45 కోట్ల మంది అసంఘ టితరంగంలో పనిచేస్తున్నారు. వీరి శాతం 85 నుండి 90 వరకు ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో నిర్మాణ రంగం, వస్తు తయారీ రంగం, సేవారంగంలోను గ్రామీణ ప్రాంతా లలో వ్యవసాయం, చేనేత పరిశ్రమలోనూ అసంఘటిత కార్మికులను చూడవచ్చు. భారత దేశంలో 50 లక్షల గృహ కార్మికులలో 92 శాతం మంది మహిళలు, ఆడపిల్లలే. ఈ కార్మికులకు అధికారిక నియామక పత్రాలు, సమంజసమైన వేతనం, సామాజిక రక్షణ, భూమి యజమాన్యం, బ్యాంక్ రుణాలు లేని కారణంగా వడ్డీ వ్యాపారస్థుల ఉచ్చులో చిక్కి నిర్బంధ శ్రామికులుగా మరే ప్రమాదం పెరుగుతున్నది. అసంఘటిత రంగంలో కూడా ఆర్ధిక అవకాశాలు లేని కారణంగా పని కోసం విదేశాలకు వలసలు వెళ్ళే పరిస్థితికి నెట్టబడు తున్నారు. కపట అజెంట్లు, మధ్య వర్తుల మోసపు నియామకాల కారణంగా ఈ కార్మి కులు అక్రమరవాణా ఉచ్చులో చిక్కు కుంటున్నారు. రాజస్తాన్లో శాండ్ స్టోన్ గనులలో పనిచేసే సీజనల్ పనివారు పనిలేని రోజులలో రోజువారీ ఖర్చుల కోసం యజమాని నుండి అప్పు తీసుకున్న వారిని అప్పు తీర్చడానికై పని చేయమని నిర్బంధిస్తున్నట్లు తెలియజేశారు. ఇటువంటి వారిని రెడీమేడ్ దుస్తులు, బట్టల పరిశ్రమలోను, వ్యవసాయం, ఇటికల తయారీ, టీ ఉత్పత్తిలోనూ, అక్రమ మైకా మైనింగ్లోనూ చూడవచ్చును. అనేక మంది కార్మికులకు కోవిడ్ మహమ్మారి తరువాత పరిస్తితి మరింత దిగజారింది. కొంతమంది పిల్లలను మంచి జీతం ఇస్తామని నమ్మించి భౌతిక దాడులు చేస్తామని భయపెట్టి గాజుల తయారీలో జీతం ఇవ్వకుండా పనిచేయించుకున్నట్లు రిపోట్లు వచ్చాయి. అదేవిధంగా ఫ్యాక్టరీలో మంచి జీతానికి పని కల్పిస్తామని నమ్మబలికి మానవ అక్రమ రవాణాదారులు గృహ బానిసత్వంలోకి దించిన సంఘటనలను కూడా కోవిడ్ కాలంలో జరిగి నట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఉదార వాద విధానాలు అమలుచేసిన తరువాత శాశ్వత కార్మికులను నియమించే బదులు టెంపరరీ కార్మికులను, పీస్ రేట్ కార్మి కులను, ఫిక్స్డ్ టైమ్ కార్మికులను, కాంట్రాక్ట్ కార్మికులను, డైలీ వేజ్ కార్మికులను, క్యాజువల్ కార్మికులను నియమిస్తున్నారు. జమాటో, అమెజాన్, స్విగ్గీ, ఉబర్, రెడీమేడ్ దుస్తుల రంగంలో పనిచేసే వారు, స్కీం వర్కర్లు మొదలైనవారందరు ఆధునిక శ్రమ దోపిడీకి గురి అవుతున్న కార్మి కులే.
ఘర్షణలు, వాతావరణ మార్పులు, ప్రధాన స్రవంతి నుంచి నెట్టివేయబడిన మైనారిటీలు
జమ్మూ-కాశ్మీర్లో ఉగ్రవాదులకీ, సాయుధబలగాలకీ ఘర్షణ కారణంగా, తూర్పున మావోయిస్టుల తిరుగుబాటు కారణంగా, ఈశాన్య ప్రాంతాలలో జాతుల మధ్య సంఘర్షణ వలన 2022 డిసెంబర్ నాటికి 6,31,000 మండి నిరాశ్రయుల య్యారు. ప్రకృతి విపత్తుల కారణంగా సుమారు 25 లక్షల మంది 2022లో నిర్వాసితులయ్యారు. ఈ సంక్షోభాలను అవకాశంగా తీసుకుని అక్రమ రవాణాదారులు వనరులు, రక్షణ లేనివారిని, బంధువులు స్నేహితుల సహకారం లేని వారిని, వలసలకు సంబంధించిన సమాచారం లేని వారిని ఎంపిక చేసుకుని ఆ వ్యక్తులను దోపిడి చేస్తున్నారు. అబ్బాయిలను సాయుధ ఘర్షణల కోసం నియమిస్తూవుంటే మహిళలను నిర్బంధ వివాహలలోనికి రక్షణ పేరుతో దించుతున్నారు. కుల వ్యవస్థ కూడా ఆధునిక బానిసత్వానికి సహకరిస్తున్నది. హిందూ మతం ప్రజలను అగ్ర
కులాలు, నిమ్న కులాల వారిగా విభజించింది. చరిత్రాత్మకంగా నిమ్నకులాల వారు విభజనకు, అణిచివేతకు, వెట్టి చాకిరీకి, వివక్షతకు గురవుతున్నారు. రాజ్యాంగం ఏ ఒక్క పౌరుడూ వివక్షతకు గురికాకూడదని చెప్పి నప్పటికి, వెట్టి చాకిరీని నిషేధించినప్పటికీ, కుల వివక్షత, వెట్టి చాకిరీ కొనసాగుతున్నాయి.
* ముగింపు
మానవ హక్కుల ఎజెండా లైంగిక దోపిడీ, వ్యభిచారం నైతికతను సవాల్ చేస్తున్నది. ప్రస్తుతం ప్రపంచంలో రెండు రకాల వాదనలు ఉన్నాయి. ఒక వాదన ప్రకారం ఏ రకమైన లైంగిక దోపిడీ/ అన్ని రకాల వ్యభిచారం మహిళలను లైంగిక వస్తువులుగా పరిగణిస్తుంది. కనుక లైంగిక దోపిడీని/ వ్యభిచారాన్ని అరికట్టాలి అన్నది ఒక వాదన. రెండవది, వ్యభిచార వృత్తిని ఇతర ఏ వృత్తి మాదిరిగానే పొట్ట కూటి కోసం చేస్తున్నారు కనుక, వారికి కార్మికుల హోదా ఇచ్చి వారి హక్కులు అమలు అయ్యేటట్లు చూడాలన్నది రెండో వాదన. అయితే ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏమిటంటే వ్యభిచార వృత్తి స్వచ్ఛందంగా చేసినా లేదా ఒత్తిడితో చేసినా దానిని చట్టపరమైన పనిగా గుర్తించాలా, వద్దా? వ్యభిచారాన్ని పనిగా గుర్తిస్తే మహిళలకు కొన్ని హక్కులు, కొంత మేరకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది. అదో తాత్కాలిక పరిష్కారమే కానీ శాశ్వత పరిష్కారం కాదు. వ్యభిచారం అన్నది మోనోగామి ఒక వైవాహిక వ్యవస్థగా స్థిరపడిన తరువాత ఎక్కువగా వ్యాప్తి చెందింది. వ్యభిచారం సమాజంలో నిర్మూలిం చాలి అంటే సమాజంలో ఉన్న అన్ని రకాల అసమానతలను, దోపిడిని నిర్మూలించాలి. అభద్రత ఆధునిక భానిసత్వానికి ప్రధాన కారణాలలో ఒకటి. అభద్రతకు పేదరికం, ఘర్షణలు, రాజకీయ అస్థిరత, ప్రజల హక్కుల హననం, చారిత్రకంగా సామాజిక, ఆర్థిక అసమానతలు, ఒక పద్దతి ప్రకారం కనీస అవసరాలు తీరకుండా చేయడం వంటివి కారణాలు. ఈ కారణాలవలనే మహిళలు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడం కోసం, కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పనిని వెతుక్కునే క్రమంలోను, పనిలో చేరిన సందర్భంలోనూ బానిసత్వంలోకి నెట్టబడుతు న్నారు. మహిళలు ఎగుమతి కోసం ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. మన దేశం నుండి ఎగుమతి అవుతున్న కొన్ని ప్రధాన ఉత్పత్తులు... రొయ్యలు, చేపలు, రెడీమేడ్ దుస్తులు, కార్పెట్లు, డైమండ్లు, బంగారు నగలు, ఎలెక్ట్రానిక్ వస్తువులు మొదలైనవి. ఈ వస్తువుల ఉత్పత్తిలో మహిళలు అధిక శాతం పాల్గొంటున్నారు. ఈ వస్తువుల తయారీకి ఓపిక, చేతులను చురుకుగా, వేగంగా తిప్ప గలగడం అవసరం. ఇటువంటి పనులను మహిళలు పురుషులకంటే బాగా చేయగలరు. మహిళల వేతనాలు పురుషుల వేతనాలకంటే తక్కువ. ఆ కారణంచేత ఉత్ప త్తిసంస్థలు తక్కువ వ్యయానికి ఉత్పత్తి చేసి అంతర్జాతీయ పోటీని ఎదుర్కొని లాభాలను ఆర్జింస్తూన్నాయి. సమాజంలో అనాదిగా వెళ్ళూనికొని ఉన్న పితృస్వామ్య భావజాలాన్ని, మతపరమైన వివక్షతను పెట్టుబడిదారులు ఉ పయోగించుకుని మహిళా కార్మికులను తక్కువ వేతనంతో ఎక్కువ గంటలు వని చేయించుకుంటున్నారు. లైంగిక హింస ద్వారా మహిళలను అణచివేస్తున్నారు. కనుక ఉ దారవాద విధానాలు అమలైన తరు వాత మహిళలు అత్యంత దోపిడీకి గురవు తున్నారు.
ప్రభుత్వం పాలనావరంగా, చట్టపరంగా, సంక్షేమానికి సంబంధించిన చర్యలు తీసుకోవ డం ద్వారా ఆధునిక బానిసత్వా న్ని నిర్మూలన చేయ వచ్చను అనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అయితే ఉ దారవాద విధానాలు సంక్షేమ పధకాల అమలుకి అడ్డంకిగా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోవాలని ద్రవ్య పెట్టుబడి షరతు విధిస్తుంది. ప్రభుత్వం లోటుబడ్జెట్ ద్వారానే వ్యయాన్ని పెంచుకోగలదు. కానీ
ప్రభుత్వ బడ్జెట్లోటు జిడిపిలో 3 శాతం కన్నా ఎక్కువ ఉండకూడదని ఎక్ఆర్బిఎం చట్టం చెప్తుంది. కనుక ప్రభుత్వం సంక్షేమ పథకాలను అపరిమితంగా అమలుచేయలేదు. అలా చేయాలంటే తన విధానాలను మార్చు కోవలసి ఉంటుంది. ఆధునిక బానిసత్వానికి మూలం ప్రస్తుతం ఆచరణలో ఉన్న సామాజిక ఆర్థిక దోపిడీ వ్యవస్థ. భారత దేశంలోనే చూసుకుంటే ఉదారవాద విధానాలలో భాగంగా పెట్టుబడు లను ఆకర్షించాలనే సాకుతో కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన విధానాలను అన్ని రంగాలలో అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు రోజుకు పని గంటలను 13 గంటలకు పెంచడం, రైతులకు గిట్టుబాటు ధర, ఎరువులు, విత్తనాలకు రాయితీలు లేకుండా చేయడం, గిరిజనుల భూములను గిరిజనులుకాని వారికి చెందేట్టుగా చట్టాలలో మార్పు చేయడం, సామాజిక వనరులు అయిన భూమి, గనులు, అటవీ సంపద లాంటి వాటిని కార్పొరేట్ సంస్థలకు అతి చవకగా కట్టబెట్టడం లాంటి చర్యలు దోపీడీ వ్యవస్థను బలపరిచే చర్యలే కానీ సామాన్య ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే చర్యలు కావు. అదేవిధంగా ఆర్ధిక అభివృద్ధికి పెట్టుబడే ప్రధానం, శ్రమకు ప్రాధాన్యత లేనట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఉత్పత్తి శ్రమ లేకుండా జరగదు... అది శారీరక శ్రమ అయినా లేదా మానసిక శ్రమ అయినా. శ్రమ విభజన, యాంత్రీకరణ చోటు చేసుకున్న తరువాత శారీరక శ్రమ తగ్గింది కానీ శ్రమ అవసరం లేకుండా పోలేదు. యంత్రాలలో కూడా శ్రమ దాగివుంది. గతంలో మనిషి చేసిన శ్రమ ఫలితంగా యంత్రాలు తయారయ్యాయి. యంత్రాలలో శ్రమ నిర్జీవ రూపంలో ఉంది. కొత్త యంత్రాలు, యంత్ర పరికరాలు, అన్వేషణలు చేయాలన్నా శారీరక, మానసిక శ్రమ అవసరం. కనుక శ్రమతోనే ఈ ప్రపంచం ముందుకి వెశుతుంది. అటువంటి శ్రమ ప్రాధాన్యతను తగ్గించి పెట్టుబడికి ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడమంటే పెట్టుబడిదారీ వ్యవస్థను బలపరచడమే. కనుక పెట్టుబడిదారీ విధానాలను బలపరిచే ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేసినప్పుడు మాత్రమే సామాన్య ప్రజలు, మహిళలు స్వేచ్ఛను, సాధికారితను పొందగలుగుతారు. కనుక పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయమైన సోషలిస్టు వ్యవస్థలోనే సామాన్య ప్రజల, ముఖ్యంగా మహిళల హక్కులు కాపాడబడతాయి.
సోషల్ సైన్టిస్టు వ్యాసం ఆధారంగా - నవంబర్ 2025 మార్క్సిస్టు మాసపత్రిక నుండి




Comments