top of page
  • Bonafide Voices

Ph.D వైవా

Prof. V. Rajyalakshmi

Honorary Professor (Law)

Andhra University


ప్రశ్న: నీ పరిశోధన సారాంశం ఏమిటో చెప్పు

జవాబు: ఆ ఒక్కటీ అడక్కు


ప్రశ్న: నీ పరిశోధనలో ఉన్న ఒరిజినల్ కంట్రిబ్యూషన్ ఏమిటి?

జవాబు: పాత అట్ట తీసేసి కొత్త అట్ట వెయ్యడం


ప్రశ్న : నీ రీసెర్చ్ మెథడాలజీ ఏమిటి ?

జవాబు: కట్, కాపీ, పేస్ట్


ప్రశ్న: నీ హైపోథిసిస్ ఏమిటి ?

జవాబు: నేను రాసినదేమిటో నాకు ఒక్క ముక్క తెలియకపోయినా కూడా నాకు పీ హెచ్ డీ వచ్చేస్తుంది


ప్రశ్న: నీ థీసిస్ స్కోపు సిగ్నిఫికెన్సు ఏమిటో చెబుతావా ?

జవాబు: నా పేరుకు ముందు డాక్టర్ అని తగిలించుకునే సిగ్నిఫికెన్సు వుంది. డాక్టరేటు అడిగే ఉద్యోగాలకు

అప్లికేషన్ పెట్టుకునే స్కోప్ ఉంది.


ప్రశ్న: నీ లిమిటేషన్స్ ఆఫ్ స్టడీ ఏమిటి?

జవాబు: 1. నా డాక్టరేటు సులభంగా తెచ్చుకోడానికి వీలు కాకుండా అడ్డంగా ఉన్న గైడ్

2. ఎలకలు కొట్టేసిన పాత తీసెస్సు బుక్స్


ప్రశ్న: నీ సోర్సెస్ ఆఫ్ స్టడీ ఏమిటి?

జవాబు: 1. రీ సైకిల్డ్ థీసిస్ పుస్తకాలు

2. డబ్బిస్తే రాసి పెట్టే ఘోస్ట్ రైటర్స్


ప్రశ్న: నీ పరిశోధన అనుభవం లోంచి నువ్వు స్వంతంగా విశ్లేషించుకున్న విషయం ఏ ఒక్కటన్నా

ఉందా నాయనా ?

జవాబు: లేకేం చాలా ఉందండి

పాత తీసిస్ పుస్తకాలు దొరికే చోట్లు, ఘోస్ట్ రైటర్స్ ఎక్కడ దొరుకుతారో వాళ్ళతో ఎలా

బేరాలు చేసుకోవచ్చునో అన్నీ బాగా తెలుసుకున్నాను.

అంతే కాకుండా గైడ్స్ ఎన్ని రకాలు ఉంటారో కూడా తెలుసుకున్నాను.

గైడ్స్ లో మూడు రకాలు ఉంటారండీ.

1. అథములు

2. మధ్యములు

౩. ఉత్తములు

అథములు లక్షణాలు

పరిశోధనా గ్రంథంలో రాసిన అన్ని వాక్యాలనీ చదివేసి తప్పులన్నీ వెతికేస్తూ కాపీ చేసిన వన్నీ కనిపెట్టేసేవాడు. పరిశోధకుడు అనేవాడు తన టాపిక్కు మీద పూర్తి అవగాహన తెచ్చేసుకోవడమే కాకుండా అందులోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించాలి అన్న దురాశతో పరిశోధకుడి కాలాన్నీ తన కాలాన్నీ కూడా వెచ్చించే చాదస్తుడు. తనని మెప్పించని పరిశోధనా గ్రంధంపై సంతకం విదల్చని అతి పిసినిగొట్టు.


మధ్యముడి లక్షణాలు

డాక్టరేట్ అంటే పరిశోధకుడు ఆశపడే ఒక పొడుగాటి కాయితం ముక్కే అనీ, గైడ్ అనే జీవి ఆ కాయితం ముక్క తన రీసెర్చ్ స్టూడెంట్ చేతికి తెప్పించే నామమాత్రపు సూత్రధారి మాత్రమే అని తెలుసుకున్న మానసిక పరిపక్వత పొందిన వాడు.

తన సంతకం కోసం తన ముందు ఉంచబడిన పరిశోధనా గ్రంధం అక్షరాలతో నింపబడి అరచేతి నిండా పట్టేంత మందాన వుంటే చాలు అన్న ఇంగిత జ్ఞానం కలిగిఉన్నవాడు. ఆ గ్రంధంలో ఏమి రాశాడో తెలుసుకోవాలనే అనవసర కుతూహలం లేనివాడు. కానీ దానికి ఉన్న అట్ట మాత్రం అతి కొత్తగా ఉండాలి అన్న కనీస అవగాహన వున్నవాడు. అయితే తాను నామమాత్రపు సూత్రధారి అయినప్పటికీ తన సంతకానికొక విలువ ఉన్నదనే వ్యవహార జ్ఞానం కలిగి ఉండి తన సంతకానికి వున్న విలువని పరిశోధకుడినుంచి ధన రూపేణా గానీ, వస్తు రూపేణా గానీ, ఇంటి సేవల రూపేణా గానీ వసూలు చేసుకున్న తరువాత సంతకం చేసేవాడు.


ఉత్తముడి లక్షణాలు

తొలుతగా పరిశోధకుడి రచనా వ్యాసంగంలో వున్న లోపాలని వెతికి పట్టుకుని వాటిని సరిదిద్దుకోడానికి దిశానిర్దేశం చేసిన తర్వాత ఆ పరిశోధకుడిలో తన తప్పులు దిద్దుకునే ఉద్దేశం గానీ, సత్తాగానీ లేదు అని అర్ధం చేసుకున్న మరు క్షణం నుంచే పరిశోధకుడు మీదగాని అతని గ్రంధం మీదగాని శ్రద్ధ పెట్టడం విరమించుకొనేవాడు. తద్వారా తన సమయాన్నీ శ్రమనీ ఆదా చేసుకునేవాడు. తన సంతకానికి విలువ ఉంది అది ధన, వస్తు,సేవ రూపేణా చెల్లించుకోడానికి పరిశోధకుడు సిద్ధంగానే వున్నాడు అని తెలిసినాకూడా అలాంటివాటిని ఆశించకుండానే కళ్ళు మూసుకొని సరస్వతీ దేవిని క్షమించేసేయమని అడుగుతూ పరిశోధనాగ్రంధంగా పిలవబడే పుస్తకంలో నిర్లిప్తంగా సంతకం పెట్టేసి చేతులు దులిపేసుకునేవాడు.


ప్రశ్న: నిన్ను వైవా చేసే అర్హత నాకు వుందా???

జవాబు: ఇది చాలా మంచి రీసెర్చు టాపిక్ సార్. దీని మీద మీరు పోస్ట్ డాక్టరేట్ తీసిస్ చెయ్యండి

సార్.

 

Dr. V. Rajyalakshmi, Honorary Professor of Law, Andhra University

214 views0 comments
bottom of page