top of page
  • Bonafide Voices

పోయింది!

--వి. రాజ్యలక్ష్మి


నేను ఎంతో ఉత్సాహంతో నా ప్రయాణం మొదలు పెట్టాను. కొంచెం ముందుకు వెళ్ళానో లేదో హృదయవిదారకమైన ఏడుపు లీలగా వినబడింది. నేను ముందుకు నడిచేకొద్దీ ఆ ఏడుపు నాకు దగ్గరైంది. దీక్షగా చూస్తే ఒక మనిషి వెక్కిళ్ళు పెడుతూ ఏడవడం కనిపించింది. నేను ముందుకు సాగాలనుకున్న దారిలోనే కావడంతో అతన్ని దాటుకుని తప్ప నేను ముందుకు వెళ్ళలేను. అతని పక్క నుంచి ఏదో లాగా ముందుకు వెళ్ళడం పెద్ద అసాధ్యం అయిన విషయమేమీ కాదు గాని ఎందుకో అలా చేయలేకపోయాను. బహుశా నేను వెళ్లబోయే దారిలో ఎదురుపడే విశేషాలని తెలుసుకోవలనుకునే కుతుహలమో, నా కంటే ముందు తరం వాడుగా కనపడుతున్న ఆ మనిషి పై పుట్టిన సహానుభూతి వల్లనో, అన్నిటికన్నా ముఖ్యంగా అతని ఏడుపు వలన తెలీకుండానే నాలో పుట్టిన భయప్రకంపనలు అనవసరం అని తేల్చే కారణం అతని వద్దే దొరుకుతుందేమో అనే ఆశ వలనో, నాకే తెలియని మరే ఇతర కారణాల వల్లనో గానీ, నాకు ఎదురుగా కూర్చొని ఏడుస్తున్న వ్యక్తి దగ్గరకెళ్ళి మెల్లిగా అడిగాను.


ఎందుకు ఏడుసున్నావనే నా ప్రశ్న పూర్తి అయీ కాకుండానే ‘పోయింది! పోయింది!’ అంటూ బావురుమన్నాడు. తనకు తానుగా సంభాళించుకుటాడేమోనని కాస్తసేపు చూసి అతని ఏడుపుకు ఆనకట్ట వేసే ప్రయత్నంలో నేనూ నా స్వరం పెంచి అడిగాను ఎందుకు ఏడుస్తున్నవని. ‘ఎందుకేంటి? పోయింది’ అని నేను ఏడుస్తుంటే విని కూడా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావేంటి?’ అంటూ దుఃఖాతిశయంతో నా మీద విరుచుకుపడ్డాడు. కొంచెం బిత్తరపోయినా అంతలోనే సంజాయిషీ ధోరణిలో అడిగాను. అంతులేనట్లున్న నీ రోదన చూస్తుంటేనే నువ్వు అత్యంత విలువైనదేదో పోగొట్టుకున్నావని నాకు అర్థం అయింది. కాకపోతే నువ్వేం పోగొట్టుకున్నావో చెపితే కదా నాకర్ధమైయ్యేది, నీకు సహాయం చెయ్యగలిగేది’ అన్నాను. అయినా సమాధానం చెప్పే ప్రయత్నం చేయకుండా ఏడుస్తున్న అతని మీద విపరీతమైన జాలి కలిగింది. అతన్ని సానుభూతిగా చూస్తూ ‘చూడు! పోయిందేమిటో చెప్పమని నిన్ను నేను కాలక్షేపంగా అడగడం లేదు. నిన్ను చూస్తే చాలా జాలిగా ఉంది. వీలుంటే సహాయం చేద్దామని అడుగుతున్నాను. ఏం పోగొట్టుకున్నావో నువ్వు చెబితే ఇప్పటి వరుకూ చేసిన నా చిన్నపాటి ప్రయాణపు దారిలో ఎక్కడైనా అరకొర ధ్యాసతో దాన్ని నేను చూసి వుంటే గుర్తు తెచ్చుకొని నీకు చెబుతా’ అన్నాను. ‘లేదు లేదు నేను పోగొట్టుకున్నది ఇప్పటి వరుకూ నేను ప్రయాణిoచిన దారిలోనే. అంటే నువ్వు ముందుకు పోబోతున్న దారిలోనే’ అని ఖచ్చితమైన స్వరంతో బదులిచ్చాడు ఆ వ్యక్తి. ‘సరే అయితే, నిన్ను చూస్తే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పోయే పరిస్థితిలో ఉన్నావు. అంచేత నువ్వు ఇక్కడే కాసేపు కూర్చో. నేను ముందుకు వెళ్తాను. నువ్విచ్చే వివరాలబట్టి నువ్వు పోగొట్టుకున్నదాన్ని నేనే వెతికి తెచ్చి నీకిస్తాను. నీకివ్వడానికి నేను వెనక్కి తిరిగి రావటానికి నేను కొంత ప్రయాస పడవలసి వచ్చినా మరేం ఫరవాలేదులే. నా కంటే పెద్దతరం వాడివి. నీ దుఖం తగ్గించడానికి ఆ మాత్రం ప్రయాస పడడం నాకేం కష్టం కాదులే’ అన్నాను. అతను విరక్తిగా నవ్వాడు. ‘నీ సానుభూతికి ధన్యవాదాలు. కానీ నీకు అది దొరకుతుందన్న ఆశ నాకేమాత్రం లేదు. ఎందుకంటే నువ్వు వెళ్లబోయే దారిలో నేను దాన్ని విడిచిపెడితేనే కదా నీకు దొరికేదీ, దాన్ని నువ్వు నాకు వెనక్కి తెచ్చిఇవ్వగలిగేదీ’ అన్నాడు. ‘ఏమిటయ్యా బాబూ! ఒక పక్క పోయింది పోయింది అంటూ శోకాలు పెడుతున్నావు. మరో పక్క నువ్వు వదిలిపెట్టనేలేదని అంటున్నావు. నువ్వు చెప్పినదానిలో ఏది నిజo ఏది అబద్ధం? నువ్వు పోగొట్టుకోవడమా? నువ్వు వదలక పోవడమా? ఇందులో ఏది నిజం?’ అని గదమాయిoచాను. ‘రెండూ నిజమే’ అని అతను అనగానే మళ్ళీ అతన్ని గట్టిగా కసురుకొబోయాను. అంతలో నాకు తట్టింది. ఓ! బహుశా అతని వస్తువుని ఎవరో బలవంతంగానో లేక అతను చూడకుoడానో దొంగతనం చేసివుంటారు. ఈ ఆలోచన రాగానే అదే మాట అతన్ని అడిగాను. ఎవరైనా దొంగలు దొంగిలిoచుకు పోయారా అని. దానికి అతను ‘వేరే వాళ్ళు దాన్ని నా దగ్గర్నుంచి తీసుకుపోయారు నిజమే కానీ తీసుకెళ్ళినవారు దొంగలూ కాదు, వాళ్ళు చేసింది దొంగతనమూ కాదు. ఎoదుకంటే వాళ్ళు తీసుకుపోయింది వాళ్ళు నా దగ్గర దాచి ఉంచిoదే’ అనగానే ఒక్కసారిగా తల గిర్రున తిరిగినట్లయిoది. ‘పోయిన బాధలో నువ్వేం మాట్లాడుతున్నవో నీకు తెలుస్తున్నట్లుగా లేదు. ఆ పెట్టినవాళ్ళు ఎవరో ఏమిటో నా కెందుకులే గానీ వాళ్ళు నీ దగ్గర దాచినిదాన్ని వాళ్ళే తీసుకుపోతే పోయింది పోయింది అంటూ నువ్వు గగ్గోలు పెట్టి నన్ను గందరగోళంలో పడేశావు’ అని విసుక్కుని అతన్ని తప్పించుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేశాను.


నా చేతిని ఎవరో లాగినట్టు అనిపించింది. చూస్తే అతను నా చేతిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఇలా అన్నాడు ‘అది నా దగ్గర వున్నన్నాళ్ళు దాని విలువేoటో నాకు తెలిసిరాలేదు. వాళ్ళు తీసేసుకున్నాకే వాళ్ళు నా దగ్గర దాచి ఉంచింది అత్యంత విలువైoది అని తెలిసొచ్చింది’ అంటూ బావురుమన్నాడు. ‘ఎవరి సొత్తు వాళ్ళకి తిరిగిచ్చేసి ఏదో తన సొంత వస్తువు పోయినట్లు ఏడుస్తున్న అతని మూర్ఖత్వాన్ని చూసి చికాకేసినా, తిరిగి ఇచ్చేసిన దానికోసం అంతగా దుఖఃపడుతున్న అతన్ని చూసి మళ్ళీ జాలేసింది. ‘పోనీ! వాళ్లనే కాళ్లా వేళ్ళా పడి బ్రతిమలాడలేకపోయావా నీకు దాని మీద అంత తాపత్రయం వుంటే? ఇoకొంతకాలం దాన్ని నీ దగ్గర ఉంచుకోవడానికి వాళ్ళు ఒప్పుకొంటే నీ సరదా తీరే వరకు నీ దగ్గరే అట్టే పట్టుకొని ఇచ్చేద్దువుగాని, ఏమంటావు?’ నా మాట పూర్తవ్వకుండానే నన్ను మితిమీరిన ఆగ్రహంతో చూస్తూ ‘నేను పోగొట్టుకొన్నది సరదాకో సంబరానికో పనికొచ్చేది కాదు. నా జీవితానికే అవసరం తెలిసిందా?’ అన్నాడు రోషంగా. ‘అయితే వాళ్లనే ఎలాగోలా ఒప్పించుకొని దాన్ని పూర్తిగా తీస్కో’ అన్నా. ‘దాన్ని నా దగ్గర తీసేసుకొన్న మరుక్షణం వాళ్ళు నాకు దూరంగా వెళ్ళిపోయారు’. అంటూ మళ్ళీ ఏడవసాగాడు. ‘పోగొట్టుకున్నదానితో అతనికెంత అవసరం వుందో! లేకపోతే అంతగా ఎందుకు రోదిస్తాడు అన్న ఆలోచనతో అతనికెలాగన్నా తరుణోపాయం చూపాలన్న పట్టుదల నాలో పెరిగింది. ‘అయితే నీకు ఇచ్చిన వాళ్ళని మినహాయించి, వేరే వాళ్ళెవరి దగ్గరైనా నువ్వు పోగొట్టుకొన్నలాంటిది గాని ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ఏదో రకంగా సంపాదించు’ అని సలహా ఇచ్చాను. ‘నాకిచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకున్న మరుక్షణం నుంచే మిగిలిన వారు కూడా నాకివ్వడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు’ అన్నాడు. ‘అయితే నీ తల తాకట్టు పెట్టైనా నీ స్వంతానికి నువ్వే కొనుక్కో’ మరో సలహా ఇచ్చాను. ‘కొనుక్కోడానికీ అమ్ముకోడానికీ అలవిగానిది అది’, వెంటనే వచ్చింది అతని సమాధానం. ‘ఇదేం విడ్డూరమయ్యా బాబూ! పోనీ నీకు నువ్వుగా ఏదో రకంగా తయారు చేసుకునే ప్రయత్నం చెయ్యి. అయితే అవుతుంది లేకపోతే లేదు. కనీసం ప్రయత్నిoచిన తృప్తి అన్నా వుంటుంది కదా’ నా సలహాకి సానుకూలమైన సమాధానం అతని దగ్గర నుండి ఇప్పుడైనా వస్తుందని ఆశతో ఇచ్చిన సలహా ఇది. ‘‘చేసుకోగలను కాని ఎవరైనా దయతలచి నాకు కావలసింది కందిగింజంత ఇస్తే దాన్ని నేను కొండగుట్టంత చెయ్యగలను. ఆ మాత్రం పెట్టుబడి ఎవరైనా పెడతారా అని నేను చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా కానీ ఆ మాత్రం అందించడానికి ఇప్పుడు ఎవ్వరూ ముందుకు రావటం లేదు. అంతకు ముందు రోజుల్లో అయితే నా దగ్గర నుంచి ఎవరైనా తీసుకున్నా గానీ వేరేవాళ్ళ దగ్గర నుంచి ఏదోలాగా సంపాదించగలిగే వాడిని. రాను రాను అలా ఇచ్చే వాళ్ళే కరువైపోయారు. పోయింది! అంతా పోయింది! దేముడా నేనెలా బ్రతకడo’ అంటూ విపరీతంగా ఏడుస్తూ క్రిందకి కూలబడ్డాడు. మితిమీరిన జాలి వేసింది. ఎలాగోలాగ అతని దుఖాన్ని తగ్గించి అతని మనస్సు తేలిక చెయ్యాలన్న పట్టుదల నాలో ఇంకా పెరిగింది. అందుకు ఇలా సముదాయించే ప్రయతం చేశాను ‘చూడు పెద్దాయనా! నువ్వు పోగోటుకున్న ఆ ఒక్కదాన్ని తలచుకొని ఎందుకలా కుంగిపోతావు? నీ జీవితంలో ఎన్ని పోయుంటాయి? ఎన్ని వచ్చుంటాయి? ఆ మాటకొస్తే నీ లాంటి వారు ఎంతమంది ఎన్ని పోగొట్టుకొని వుండరు? కాబట్టి ఎలాంటి నష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవితం సాగించాలి అంతే గానీ పోయినదాన్ని, అందునా ఒకే ఒక్కదాన్ని తలచుకుని తలచుకుని తరుక్కుపోకూడదు’ అంటూ లేని పెద్దరికంతో మందలించాను.


అయ్యో! నీ కెలా చెప్పేది? అన్నీ వేరు ఇదొక్కటీ వేరు? అది నా దగ్గర లేకొపోతే నా దగ్గరకు ఎవరూ రారు. దాన్ని నాకివ్వని ఎవరి దగ్గరకీ నేను వెళ్ళలేను. అలాంటి జీవితం ఎంత భయంకరం? అలాంటి జీవితాన్ని నేను జీవించలేనన్న భయమే నన్నిలా ఏడిపిస్తుంది.’ అన్నాడు. అతన్నలాగే వదిలేస్తే ఏడ్చి ఏడ్చి ప్రాణాలే పోగొట్టుకునేటట్టుగా వున్నాడు. అందుకే ‘ఇదిగో చూడు నీ మాటలు వింటూ నేనిక్కడే కూర్చుoటే నాకే ఏదో తెలీని భయం, నిరాశా కలుగుతున్నాయి. అలాగని నిన్ను ఒక్కడినీ వదిలేసి వెళ్ళలేకపోతున్నా. కాబట్టి మారుమాటలాడకుండా నాతో నడిచిరా. నేనిచ్చే ప్రతి సలహాకి అడ్డు పడకుండా నా ప్రయత్నం నన్ను చెయ్యనీ. నీ దగ్గరకి ఎవరూ రావటానికి ఇష్టపడటం లేదంటున్నావు కాబట్టి నువ్వు చెయ్యవలసిన ప్రయతం ఏదో నేనే చేస్తాలే. వెళ్ళే దారిలో ఎదురైయే వారిని నేనే ఏదో విధంగా బ్రతిమాలి నీకు కావలసిన దానిని సంపాదించి దాన్ని నీకిస్తా సరేనా?’ అంటూ అతని వoక చూశాను. అతని చూపులో అనుమానం తప్ప మరే భావం కనపడలేదు. మరొక్కసారి ఇంతకు మునుపు చెప్పిన మాటల్నే మళ్ళీ చెప్పి చూశాను. వింటే విన్నాడు లేకపోతె లేదు. అతని ఖర్మ అనుకుని నేను బయలుదేరాను. ఏమనుకున్నాడో ఏమో గాని ఒక విచిత్రమైన నవ్వు నవ్వి నా వెనుక మౌనంగా బయలుదేరాడు.


నా వెనుక వస్తున్న అతను తనలో తనే ‘పోయింది! పోయింది! ఇంకెక్కడ దొరుకుతుంది?’ అంటూ సణుగుకోవడం వినపడుతున్నా వినపడనట్లుగా నేను ముందుకు నడిచాను. కానీ ముందుకు నడిచేకొద్దీ నాకు ధైర్యం సన్నగిల్లింది. ఎందుకంటే నేను నడిచి వెళ్ళుతున్న దారిలో ప్రతీ మలుపులోనూ నా వెనక ధుఃఖపడుతూ వస్తున్న వ్యక్తిని నేను మొదటసారిగా చూసిన దృశ్యమే మళ్ళీ మళ్ళీ ఎదురైంది. అంటే ప్రతీ మలుపులో ఒంటరిగా కూర్చున్న వ్యక్తి హృదయ విధారకంగా ‘పోయింది! పోయింది!’ అంటూ ఏడుస్తున్న దృశ్యం నాకు మళ్ళీ మళ్ళీ ఎదురైంది. అలా నాకు ఎదురైన ప్రతీ వ్యక్తినీ వాళ్ళ దుఖానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తూనే వచ్చాను. నాకు దిగ్భ్రమ కలిగించిన విచిత్రం ఏంటంటే నా వెనుక వస్తున్న వ్యక్తి ఇంతకుముందు నా ప్రశ్నలకెలాంటి సమాధానాలు చెప్పాడో అవే సమాధానాలు వాళ్ళ దగ్గర నుండి కూడా వచ్చాయి. పోను పోనూ నేను వెళ్తున్న దారి నాకు అయోమయంగా అగమ్యగోచరంగా కనిపించిది.


నేను అన్యమనస్కంగా ముందుకు నడుస్తూనే వెనక్కి తిరిగి చూశాను నా వెనుక వస్తున్న వ్యక్తి మరింత నీరసంగా విస్పృహగా నడుస్తూ కనిపించాడు. ఇక ముందుకు నడవలేనoటూ మూగసైగలు చేశాడు. అది చూసి అతని మీద అంతులేని జాలి కలిగిoది. అతనికి ఆసరా ఇద్దామని వెనక్కి తిరిగి అతని దగ్గరకు వెళ్ళాను. నేను నోరు తెరిచి మాట్లడేలోపు అతను అన్న మాట నన్ను చేష్టలుడిగేలా చేసింది.


అతను నన్ను చూసి అన్న మాటలివి. ‘నిన్ను చూస్తే అంతులేని జాలి వేస్తుంది!’. అతనేమన్నాడో నేను సరిగ్గా విన్నానో లేదో అన్న నా సందేహాన్ని తీరుస్తూ అతను అవే మాటల్ని మళ్ళీ అన్నాడు. మొదట కోపం వచ్చినా మరుక్షణం అతనేందుకలా అంటున్నాడో అని ఆలోచిస్తే నాకు ఒక విషయం తట్టింది. అదేంటంటే నా కెదురైన వ్యక్తులందరినీ వారి దు:ఖం గురించి పదే పదే ప్రశ్నిస్తూ, ఒకే విధమైన సమాధానాన్ని రాబట్టుకుంటూ, అందుకు ఆశ్చర్యపోతూ ముందుకు వెళ్ళే క్రమంలో నా వెనక వస్తున్న వ్యక్తి పోగొట్టుకున్నదాన్ని నేనే ఏధో లాగా సంపాదించి అతనికి ఇస్తానని నేను చెప్పిన మాట మర్చిపోయాను. ఇది అర్థం కాగానే నాలో నేనే నవ్వుకొని ‘అలా మరీ వ్యంగంగా మాట్లాడనక్కరలేదులే. నేను నీకు నిజంగానే సహాయపడదామనుకుంటున్నాను. ఎందుకంటే నీ మీద నాకు నిజంగానే జాలి ఉంది. అదేమీ పైపైన జాలి కాదులే. కాబట్టి నువ్వు నా జాలి గురించి అలా వంగ్యంగా ఎగతాళి చెయ్యక్కర్లదు. ఇకపోతే నీకు నేనిచ్చిన మాట ఇప్పటివరకూ జరగలేదంటే దానికి కారణం నాకు ఇప్పటివరకు పదే పదే ఎదురవుతున్న దృశ్యాలే. ఆ దృశ్యాలు నన్ను విపరీతంగా కలవరపెట్టడంతో అయోమయావస్థలో పడి అసలు విషయాన్ని మర్చిపోయాను. ఏమీ అనుకోకు. అయినా నువ్వే స్వయంగా చూశావుగా. ఇప్పటి వరకూ నాకు ఎదురైన వ్యక్తులందరూ నీ లాంటి విస్పృహలోనే వున్నారు. పోయింది! పోయింది! అంటూ అతి నిరాశలో వున్నారు. ఇక వాళ్ళని నేనేమి అడిగేది చెప్పు.’ అన్నాను. అతనికి నా సంజాయిషీ ఇస్తున్నంతలోనే నాకు అతి ముఖ్యమైన విషయం గుర్తుకొచ్చి వెంటనే అతన్ని అడిగాను. ‘నీకు కావాల్సింది నేను తెచ్చివ్వలేకపోయానని అతి వ్యంగ్యంగా నా మీద జాలివేస్తుదంటూ నేను నీతో అన్న మాటలనే తిరిగి తిరిగి నాకు అప్పచెప్పుతున్నావు. కానీ అసలు నువ్వు ఏం పోగొట్టుకున్నావో నాకు చెప్పాలన్న కనీసం ఇంగితం లేకపోయింది. నీకోసం నా వంతు ప్రయత్నంగా నేను ఎవరి దగ్గర నుంచైనా అడిగి తీసుకోవడానికి అసలు నేను వాళ్ళను ఏంటి అడగాలో నాకు ముందు తెలియాలి కదా. ఇప్పటికన్నా సూటిగా స్పష్టంగా చెప్పు. నువ్వు పోగొట్టుకున్నదేంటో’.


సుధీర్ఘమైన నిశ్శబ్ధంలోంచి చీల్చుకుంటూ వచ్చింది అతని మాట. ‘నేను పోగొట్టుకొంది ‘నమ్మకం’. ‘ఏంటీ?’ అన్నాను. ‘అవును, నేను పోగొట్టుకున్నది నమ్మకం. మనిషి మీద మనిషికి వుండవలసిన నమ్మకం’. నా ప్రతిస్పందన కోసం ఎదురు చూడకుండానే అతని మాటలు కొనసాగించాడు. ‘ ఎదుటివాడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్న మొదటి రోజుల్లో నేను బాధ పడలేదు. పోను పోనూ నా చుట్టూ పెరిగిపోయిన నా లాంటి వాళ్ళను చూశాక నేను పోగొట్టుకున్న నమ్మకం విలువేంటో నాకు అర్ధమైoది. ఎందుకంటే నమ్మకంతో నాకు అవసరం ఎప్పటికప్పుడు ఉంటుందని ప్రతీక్షణం తెలిసొచ్చింది. ఆ వెంటే భయం మొదలైoది భయం ఎoదుకంటే అనుమానం అనే భూతం నన్నూ, నా చుట్టూ ఉన్నవాళ్ళనీ తనలో కలిపేసుకుంది. నన్ను చూస్తే ఎదుటివారికి అనుమానంతో కూడిన భయం. అందుకని వాళ్ళు నా దగ్గరకు రారు. పోనీ నేనే వాళ్ళ దగ్గర వెళ్దామంటే వాళ్ళను మాత్రం నమ్మోచ్చన్న భరోసా ఏంటి? వాళ్ళూ నా లాంటి వాళ్ళే అయ్యిoడొచ్చు కదా అని అనుమానం. అందుకని తెలిసిన వాడు తెలియనివాడు అనే తేడా లేకుండా ప్రతిక్షణం ప్రతీవాడిని అనుమానిస్తూ భయపడే జాగ్రత్త నాది. ఆఖరికి నన్ను నిజంగా నమ్మేవాడిని కూడా నా అనుమానంతో నేనే దూరం చేసుకున్న పరిస్థితి నాది. అంతెందుకు నన్ను నేనే నమ్మలేని పరిస్థితిలోకి జారిపోయిన దుస్థితి నాది. ఇలాంటి పరిస్థితి ఎంత భయంకరంగా వుంటుందో నాకు తెలుసు కాబట్టే నీ మీద నాకు చాలా జాలి కలుగుతుంది’ అన్నాడు. ‘నీ మీద నీకు జాలి వుండటం సహజమే. కానీ మధ్యలో నా మీద నీ కెందుకు జాలి? అసలు నేనెవరో నీకేం తెలుసని నా మీద జాలి పడుతున్నావ్?’ ఆశ్చర్యంగా అడిగాను అప్పటికి నాలో ఉదృతమవుతున్న భయాoదోళనని అదుముకుంటూ. అతను అభిమానంగా నా తల నిమిరాడు. అంతలోనే ఒక అపరాధ భావనతో కూడిన మంద్ర స్వరంతో అన్నాడు. ‘నాకెందుకు తెలియదు? నువ్వు కొత్త తరం కోసం రూపుదిద్దుకొని వస్తున్న మనిషివని. నా ప్రయాణం ఎలా మొదలైందో నీ ప్రయాణం కూడా అలానే మొదలైంది. కాకపోతే నా ప్రయాణం మొదలయిందీ సాగిందీ కూడా ముందు తరంలో. ఇకపోతే నీ మీద జాలె౦దుకంటావా? నా ముందు తరం వాళ్ళు మాకు మనిషి మీద నమ్మకం అనే మంచి బాటని వేస్తే మేము ఆ బాటని అనుమానాల బాటగా మార్చేశాం. నువ్వే స్వయంగా చూసావుగా. నువ్వు వెళ్ళాలనుకున్నదారి ప్రతీ మలుపులో నా లాంటి వాళ్ళు ఎందరెదురయ్యారో... ఎంత ఏడుస్తున్నారో నువ్వే గమనించావుగా. మేము వేసుకున్న అనుమానాల బాటలో మేమే బ్రతకలేక ఛస్తున్నాం. ఇక నువ్వెలా బ్రతకగలవ్? అందుకే నువ్వంటే చాలా జాలేస్తుంది’ అన్నాడు. ఈ మాటలు వినగానే నాలో అతని మీద ఇప్పటివరుకూ ఉన్న జాలి పూర్తిగా కరిగిపోయి ఆ స్థానంలో ఒక ఏహ్యభావం వచ్చింది.


అతన్ని అతని ఖర్మానికి వదిలేసి నేను ఒక్కడినే ముందుకెళ్ళాలనుకున్నా కానీ నేను వెళ్ళవలసిన నా ముందు దారి పట్ల అప్పటికే నా మనస్సులో తిష్టవేసుకుని కూర్చొన్న అయిష్టం భయం నా కాళ్ళకి అడ్డం పడ్డాయి. ఒక నిమిషం ఆగి ఆలోచించాను. ఆలోచిస్తూనే ఒక పదడుగులు ముందుకు వెళ్ళాను. అంతలో మళ్ళీ ఆగి వెనక్కి వెళ్ళాను. నేను వదిలేసి వచ్చిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాను. అతను అప్పటికే క్రింద కూలబడిపోయి ఉన్నాడు. నేను అతని వేపు తిరిగి వస్తున్నానన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఏడుస్తున్నాడు. అతనికి మరింత దగ్గరగా వెళ్లి అతన్ని నిలబెట్టాను. అతని చిటికెనవేలు పట్టుకొని ముందుకు పదమన్నాను. నా వెనుక కాదు. నాతో కలిసే నడవమన్నాను. అతను ఏమనుకున్నాడో గాని నా మాట కాదనలేదు.


నా వంకే చూస్తూ నాతో కలసి నడుస్తున్న అతను అడగని ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. ‘మనం ముందుకు నడుస్తున్న దారి ఆశావహదారి. ఈ దారిలో ఎక్కడోచోట, ఎంతో కొంత నమ్మకం దొరకకపోదు. దాన్నే కొంచెం కొంచెంగా పోగు చేద్దాం. అందరికి పంచుదాం. దొరకక దొరకక దొరికిన దాన్ని ఎవరూ బదులుకోరు కదా. నువ్వు తెలుసుకున్నట్టే నమ్మకం విలువ అర్థం చేసుకున్నవాళ్లందరూ కూడా కంది గింజంత నమ్మకాన్ని అంది పుచ్చుకొని కొండ గుట్టంత చేసేస్తారు చూడు’.


నా మాటలకి నాకే ఉత్సాహం. అతనికీ రెట్టింపు ఉత్సాహం. ఇద్దరం కలిసి వడి వడిగా ముందుకు సాగుతున్నాం. మేమిద్దరం కలిసి వేస్తున్న ప్రతీ అడుగులోనూ అనుభవం, ఆశ రెండూ కలిసి నా ముందు తరానికి కావలసిన బలమైన బాటని వేస్తున్నాయి.109 views0 comments
bottom of page